Karthikeya's open book

Karthikeya's open book

Share

Visual story Teller

17/04/2023

🪷 #అందం_ఆనందం_అంటే_ఏంటి_నాన్నా
అని ఎనిమిదేళ్ళ కూతురు తన నాన్నను అడిగితే, వాళ్ళ నాన్న చెప్పిన సమాధానం.*

🪷రోజూ లేవగానే నువ్వు నానమ్మకు గుడ్ మార్నింగ్ నానమ్మా అని చెప్తావు చూడు, ఆ పలకరింపే అందం అంటే.*

🪷స్కూల్ కి నిన్ను తీసుకెళ్లేటప్పుడు టర్నింగ్ లో నువ్వు చేతితో సిగ్నల్ ఇస్తావు చూడు అదే అందమంటే.*

🪷ఒకరోజు నీ ఫ్రెండ్ నీకు తెలీకుండా నీ పెన్సిల్ తీసిందని నీకు తెలిస్తే మళ్లీ ఎప్పుడూ అలా చెయ్యకు కావాలంటే నన్నడుగు అంటూ షేరింగ్ ఈజ్ కేరింగ్ అని అన్నావు చూడు అదే అందమంటే.*

🪷షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఏదన్నా బొమ్మ నచ్చితే కాస్ట్లీ అయితే వద్దు నాన్నా అంటావు చూడు అదే అందమంటే.*

🪷అమ్మకూ నాకూ గొడవైనప్పుడు నా దగ్గరికొచ్చి స్మైల్ నాన్నా అంటావు చూడు అదే అందమంటే.*

🪷నీకు ఐస్ క్రీం కొన్నప్పుడు బయట నుంచి ఆశగా చూస్తున్న ఇద్దరి పిల్లలకు కూడా తీసుకో నాన్నా అన్నావు చూడు అదే అందమంటే.*

🪷అమ్మకి ఒంట్లో బాలేనప్పుడు ఇంటి పనిలో నాకు సాయం చేస్తావు చూడు అదే అందమంటే.*

🪷నా బాధ నీకు తెలీకుండా నీతో మాట్లాడినప్పుడు అలా ఉన్నావేంటి నాన్నా అంతా ఓకే అవుతుందిలే అంటావు చూడు అదీ అందమంటే అని అనగానే అందం అంటే హర్ట్ లో ఉంటుందా అన్న ఆయన కూతురు సమాధానం విన్న నేను ఆశ్చర్యంగా, ఆనందంగా తన వైపే చూస్తూ ఉండిపోయాను.*

➢ సేకరణ:- కార్తికేయ'S ఓపెన్ బుక్.🙏🙏

13/01/2023

➢ సంక్రాంతి సంప్రదాయాలు.

హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం అనే మూడు ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. సంక్రాంతి అంటే పిండివంటలు చేసుకోవడం, దేవాలయాలకు వెళ్లి దండం పెట్టుకోవడమే కాదు. మన పెద్దలు అనుసరించే సంప్రదాయాల వెనకున్న మర్మం ఏమిటి? వాటి నుంచి మనమేం నేర్చుకోవాలి? ఛాందసత్వానికి పోకుండా శాస్త్రీయంగా ఎలా అర్థం చేసుకోవాలి.

➢ ముగ్గులు.....

ఓర్పును నేర్పే కళ…
ఇంటి ముందు లోగిళ్లలో ఒక పెద్ద రథం ముగ్గో, నక్షత్రం ముగ్గో, సర్వవాకిళ్లు ముగ్గో వేస్తే చాలు. గంటసేపు ట్రెడ్‌మిల్ మీద వ్యాయామం చేసిన శ్రమకు సమానం. ముగ్గు వేయడం అంటే.. బోలెడన్ని చుక్కలు పెట్టాలి. వాటన్నిటినీ కలుపుతూ లైన్లు వేయాలి. ఒక ఆకారాన్ని తీసుకురావాలి. ఆ క్రమంలో ఎన్నిసార్లు పైకి లేవాలి, ఎన్నిసార్లు కిందికి వంగాలి.. లెక్కపెట్టుకోలేనన్నిసార్లు కదలాల్సి వస్తుంది. అందులోను జారిపోయే కొంగును సరిచేసుకుంటూ.. ముందుకు పడే జెడను వెనక్కి వేసుకుంటూ.. ముగ్గు మీద ఏకాగ్రతను సంధించాలి. ముగ్గు ఇంటికి అలంకరణే కాదు.అదొక మానసికోల్లాసం. మనసుకు, శరీరానికి ఓర్పును, నేర్పును అందించే ఫజిల్‌సాల్వింగ్ లాంటిది. ముగ్గులు మనకో తాత్విక దృక్పథాన్ని తెలియజేస్తాయి.

➢ భోగిమంటలు...

వ్యామోహానికి నిప్పు
మనుషుల మీదైనా, వస్తువుల మీదైనా వెర్రివ్యామోహం పనికిరాదు. కరుడుగట్టిన అలాంటి కోరికలేవైనా ఉంటే వాటిని వదిలించుకోవాలి. అప్పుడే జీవితం నిశ్చింతగా ఉంటుంది. ఈ మాటను ఊరికే చెబితే ఎవరు వినరు. భోగిమంట రూపంలో చెబితే వింటారన్నది పెద్దల నమ్మకం. మన లోపల పాతుకుపోయిన పాతను వదిలించుకోవడానికి భోగిమంట ఉపకరిస్తుంది. ఒక పూలతోట మీదుగా గాలి వెళితే అది సుగంధభరితం అవుతుంది. అదే గాలి ఒక మురికికాలువ మీదుగా వెళితే దుర్గంధంగా మారిపోతుంది. మనిషి ప్రాణం కూడా అంతే! మనిషి ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఆయువు గాల్లోకి కలిసిపోతుంది. ఆ స్థితిని బట్టే పునర్జన్మ దక్కుతుంది. కాబట్టి వ్యామోహాలకు దూరంగా ఉండమంటుంది భోగిమంట. ఇంట్లోని కుర్చీకి ఒక కాలు విరిగిపోయి కుంటుతున్నా సరే దాన్ని వదలం. “అది మా తాతగారిది. అదంటే నాకు సెంటిమెంటు” అని పట్టుకు వేళ్లాడతాం. పాడైపోయిన పాతవస్తువునే అంత సులువుగా వదులుకోకపోతే.. రేప్పొద్దున తుచ్ఛమైన ప్రాణాన్ని స్వేచ్ఛగా ఎలా వదలగలుగుతావు? అంతవరకు ప్రాణభయంతో నిశ్చింతగా ఉండగలవా? ఉండలేవు. అందుకే నీలోని పాతను భోగిమంటతోపాటు వదిలేయి.

➢ గంగిరెద్దులు, హరిదాసులు....

భిక్షానికీ ఓ ధర్మం..
ఏ పనీ చేయకుండా బిచ్చమెత్తుకోవడం ధర్మం కాదు. గంగిరెద్దుల వాడైనా, హరిదాసైనా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పే బిచ్చమెత్తుకుంటారు. గంగిరెద్దుల వాడైతే ఇల్లు కలవాళ్లు ఏదిచ్చినా గంగిరెద్దు మీదే వేస్తాడు తప్ప చేతికి తీసుకోడు. పాత చీరలిస్తే వాటినే తీసుకుంటారు. హరిదాసు కూడా ఏడాదికి ఒకసారే వచ్చి హరినామకీర్తనలు పాడి.. గిన్నెడు బియ్యం తీసుకుని సంతృప్తిగా ఇంటికెళ్లిపోతాడు. పండగ పోయాక మళ్లీ ఏ వీధిలోనూ కనిపించడు. హరిదాసు ఇంటి ముందుకొచ్చి గొబ్బెమ్మల్ని తొక్కి వెళితే మంచిది.

➢ గుమ్మడికాయ....

తీగల్లా అల్లుకుపోవాలి..
ఎప్పుడూ గుర్తుకురాని గుమ్మడి సంక్రాంతి రోజున గుర్తుకొస్తుంది. గుమ్మడి పోషకాల గని. ధాతుపుష్టికి, సంతానవృద్ధికి పనికొస్తుంది. ఏడాదికి ఒకసారైనా గుమ్మడికాయ వంటల్ని తినాలన్నది పెద్దల మాట. గుమ్మడి ఆకారం విశ్వస్వరూపానికి ప్రతీక. గుమ్మడి పాదు కూడా విస్తృతంగా అల్లుకుపోతుంది. మనిషి జీవితాన్ని కూడా ఎంత విస్తృతి చేసుకుంటే అంత ఉత్తమం. ఇరుకైన మనస్తత్వం కలిగుంటే ఇరకాటంలోనే ఉండిపోవాల్సి వస్తుందని గుమ్మడి చెబుతుంది.

➢ గొబ్బెమ్మలు....

అసహ్యం నుంచి అద్భుతం
కృష్ణ భక్తురాలైన గోపెమ్మ అనే పేరు నుంచి పుట్టిందే గొబ్బెమ్మ. ఈ భూమ్మీదున్న దేన్నీ అసహ్యించుకోకూడదు. ప్రతిదీ ప్రకృతి ప్రసాదితం. అసహ్యమైన పేడను కూడా అద్భుతంగా మలిస్తే అది గొబ్బెమ్మ అవుతుంది. జీవి కడుపులో ఉన్నంత కాలం పవిత్రమైనది. తల్లి కడుపు దాటి నేల మీద పడగానే అపవిత్రమైపోతుంది. అందుకే, నేల మీద పడని ఆవుపేడతోనే గొబ్బెమ్మలను చేస్తారు .

➢ భోగిపండ్లు

యోగిత్వం.. బదరీఫలం
సంక్రాంతి వస్తే పిల్లలకు భోగిపండ్లు పోసి.. మురిసిపోతుంటారు తల్లిదండ్రులు. ఇప్పుడైతే ఈ సంప్రదాయం తగ్గింది కానీ ఒకప్పుడు పిల్లలున్న ప్రతి ఇంట్లో భోగిపండ్ల దృశ్యాలు కనువిందు చేసేవి. అనాధి నుంచి వస్తున్న సంప్రదాయం ఇది. భోగిపండ్లు లేదా రేగుపండ్లలో ఎనలేని ఔషధగుణాలు ఉన్నాయి. చలికాలంలో ఎవరికైనా జీర్ణశక్తి మందగిస్తుంది. పీచు (పైబర్) పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కాని సమస్య తొలగిపోదు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ఆరోగ్య చైతన్యం లేదు కనక.. ఆ లోటును పూడ్చేందుకు రేగుపండ్లను తినమనే వారు. రేగులోని జిగట పదార్థం అన్నవాహికను శుభ్రం చేస్తుంది. ‘భుక్త్వాచ బదరీఫలం’ అన్నది అందుకే. భోంచేసిన తర్వాత రేగుపండ్లు తింటే మంచిదన్నది దాని అర్థం. రేగుపండ్లు జఠరాగ్నిని ఉరకలెత్తిస్తాయి. శరీరంలో వేడిని పుట్టించే రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి.
బదరీవనం (రేగుపండ్ల తోట)లో వేదవ్యాసుడు తపస్సు చేసేవాడన్న మరో ఐతిహ్యం కూడా ఉంది. కాబట్టే ఆయనకు బాదరాయణుడు అన్న పేరొచ్చింది. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే – రేగుపండ్లు యోగిత్వానికి ప్రతీక. మరో విశేషమేమంటే రేగుపండ్లను జంతువులు తినవు. మనుషులే తింటారు. హిందూ సంస్కృతిలో రేగుపండ్లకున్న ప్రాశస్త్యాన్ని దృష్టిలో పెట్టుకునే.. పండగపూట పిల్లలకు చిల్లర నాణేలతో కలిపి భోగిపండ్లు పోస్తారు. ఆ సమయంలో తల మీద చిల్లర నిలబడితే ‘భోగి’ అవుతారని, రేగుపండ్లు మాత్రమే నిలబడితే ‘యోగి’ అవుతారన్నది ఒక విశ్వాసం.

➢ గాలిపటం...

దారంలాంటిది జీవితం
ప్రతి మనిషికీ ఆత్మనిగ్రహం అవసరం. అది లేకపోతే జీవితంలో ఎన్నో సమస్యల్ని కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సన్నని దారంతో ఆకాశంలో ఎగిరే గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు.. మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది గాలిపటం. ఒడుపుగా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆడిస్తేనే గాలిపటమైనా, జీవితమైన ముందుకు వెళుతుంది. అయితే చేతిలో దారం ఉంది కదాని ఎంతదూరమైనా గాలిపటాన్ని వదల్లేము. ఏదో ఒక సమయంలో మళ్లీ చుట్టచుట్టి గుప్పెట్లోకి తీసుకోవాల్సిందే. ఆ గుప్పెడు అనేది భగవంతుడులాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎగిరినా భగవంతుని చేతిలోనే ఉన్నామన్న సంగతిని మరిచిపోకూడదు. గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా, ఎవరింటి మీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికీ వర్తిస్తుంది.

➢ కోడిపందేలు...

యుద్ధనీతిని గెలిపించే పందెం
పండగ పరమార్థాన్ని మరిచిపోయి దాన్ని పరహింసగా మార్చాం. నేడు జరుగుతున్న కోడిపందేలే అందుకు నిదర్శనం. కోడిపందేలకు తరాల చరిత్ర ఉంది. కాని ఆ రోజుల్లో కోళ్లకు కత్తులు కట్టి ఆనందించేవారు కాదు. ఇప్పుడు కత్తులు కట్టి, డబ్బు కట్టలు పెట్టి జూదంగా మార్చేశారు. పాతరోజుల్లో ఇద్దరి మధ్య వైరం ఏర్పడితే దాన్ని కోడిపందెం ద్వారా పరిష్కరించేవారు మధ్యవర్తులు. పల్నాటి కాలంలో మాచర్ల, గురజాల మధ్య గొడవ యుద్ధానికి దారితీసింది. అలాంటి సమస్యను కోడిపందెమే పరిష్కరించింది. యుద్ధనీతిని తెలియజేసింది.

➢ పశు పూజలు...

శ్రమకు కృతజ్ఞత
సంక్రాంతికి ఇంటి నిండా ధాన్యం వచ్చిందంటే.. అది పశువుల పుణ్యం. ఏడాది పొడవునా పశువులతో చాకిరీ చేయించడమే కాదు. పండగరోజైనా వాటిని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలంటుంది పశువుల పూజ. ఆ రోజు రైతులు నాగలి కట్టరు. ఎద్దుల మీద కాడి మోపరు. బండ్లు తోలరు. అందుకే ‘కనుమ రోజు కాకైనా కదలదు’ అంటారు.

➢ సేకరణ:- కార్తికేయ'S ఓపెన్ బుక్.🙏🙏

18/12/2022

ఆంగ్‌కోర్‌ వాట్‌ : ప్రపంచంలోనే అతి పెద్ద విష్ణుదేవాలయం, కంబోడియా దేశంలోని వేయి సంవత్సరాల హిందూ దేవాలయం..!

హిందూ సంస్కృతి ఆనవాళ్ళు విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్నట్టు ఇప్పటికే రుజువులు ఉన్నాయి. వందల వేల ఏళ్ల క్రితమే మన హిందూ సంస్కృతి ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. దీనికి నిదర్శనం కంబోడియాలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన విష్ణు దేవుని ఆలయం. హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెబుతున్న ఈ దేవాలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలను నాసా బయటి ప్రపంచానికి అందించింది. అక్కడ దాదాపు ప్రపంచానికి తెలియకుండా దాగిన 200 అద్భుతమైన నాగరికతా పెయింటింగ్ చిత్రాలను కనుగొన్నది.

1. ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయం కంబోడియాలోని సీమ్‌రీప్‌ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఆ దేశ జాతీయ పతాకంలో స్థానం సంపాదించుకుంది.
2. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్‌ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగిందని, క్రీశ 12వ శతాబ్దకాలంలో ఆంగ్‌ కోర్‌ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్‌ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట.
3. ఈ దేవాలయ నిర్మాణం భారతదేశం లోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటుంది. తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. టోనెల్‌ సాస్‌ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది.
4. భారతదేశం లో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన వాస్తు రీతితో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్‌ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందినది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృతికి దగ్గరగా ఉంటాయి.
5. ఖ్మేర్‌ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహించేదట. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయంలో కూడా వాడారు. ఇది అప్పట్లోనే ఎలా సాధ్యమయిందదనే విషయం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
6. ఐదు మైళ్ల పొడవు, ఒకటిన్నర మైలు వెడల్పుతో విశాలమైన రిజర్వాయర్లు నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. ఈ రిజర్వాయర్లను వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగించేవారట.
7. ఫ్రెంచ్‌ ఆర్కియాలజిస్ట్‌ ఫిలిప్‌ గ్లోసియర్‌ ఈ రిజర్వాయర్లపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని ధ్రువపరిచాడు. నాసాచిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధనలు జరిపిన సిడ్నీ యూనివర్శిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్‌ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు చాలా స్పష్టంగా కనిపించాయట.
8. ముఖద్వారం నుండి దేవాలయం లోపలికి వెళ్లగానే చుట్టూ పచ్చని పచ్చికతో అక్కడి వాతావరణమంతా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ముఖద్వారం నుండే మూడు పెద్ద పెద్ద గోపురాలు దర్శనమిస్తాయి. ఇందులో మధ్య గోపురం నుండి లోపలికి వెళ్తే అనేక గోపురాలు కనిపిస్తాయి.
9. ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సూర్యోదయం. ఉషోదయ వేళ ఆలయ దర్శనం అద్భుతంగా ఉంటుంది. పొద్దున లేచి గోపురం వెనుక నుండి ఉదయ భానుడు మెల్లిగా నులి వెచ్చని లేలేత కిరణాల్ని ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే చాలు... ఎంత సేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది.
10.ఈ దేవాలయంలో మరో అద్భుతమైన ప్రదేశం గ్యాలరీ. నాలుగు గోడలతో నిర్మించిన ఈ మండపంలో ఎక్కడ చూసినా హిందూ పురాణ గాథలే కనిపిస్తాయి. ముఖ్యంగా తూర్పున ఉన్న 'మంటన్‌' అనే గ్యాలరీ అందర్నీ ఆకట్టుకుంటుంది. భారత పురాణాలైన రామాయణ, మహా భారత దృశ్యాలు అనేకం ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తాయి. దేవతలూ, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మధన దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. తూర్పు వైపు మండపంలో విష్ణుమూర్తి పుట్టుక, అవతారాలకు సంబంధించిన శిల్పాలు ఉంటే పశ్చిమం వైపు మండపం గోడలపై యుద్ధాలు, మరణాలకు సంబంధించిన ఆకృతులు కనిపిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం, రామ రావణ యుద్ధ సంఘటనలు ఎంతో చక్కగా మలచబడ్డాయి.
11. ఆలయంలోని నీటిమట్టాన్ని నియంత్రించేందుకు రిజర్వాయర్ నిర్మించారు. దీని ద్వారా కరువు, వరద వంటి ప్రకృతి విపత్తులను నియంత్రించగలిగారు. ఒకదానికొకటి అనుసంధానమైన 1500 కిలోమీటర్ల పొడవునా కాలువలు నిర్మించారు.
12.రాళ్లను ఇనుము, అల్యూమినియం వంటి నిర్మాణ సామగ్రి రవాణా కోసం ఈ కాలువలను ఉపయోగించుకున్నారు. ఆలయ నిర్మాణానికి నీటిపై తేలియాడే ‘లాటరైట్' రాళ్లను ఎంపిక చేశారు. అది నాసా తీసిన ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
13. సియాన్‌రీవ్‌లోని కులేన్ పర్వతాల నుంచి తెచ్చిన ఇసుకతో శిలలను అతికించి, శిల్పాలు చెక్కారు. వాటిని అంత దూరం నుంచి ఇక్కడకు తరలించేందుకు ఏనుగులను, తేలియాడే బల్లకట్లను వాడారు.
14. రిజర్వాయర్లను వ్యవసాయ అవసరాలకు పలు దేశాల శిల్పులు, సుమారు ఐదువేల మంది కార్మికులు రాత్రింబవళ్లు ఈ నిర్మాణం కోసం శ్రమించారు.
15. ఇక ఈ దేవాలయంలో దాగి ఉన్న అద్భుతమైన పెయింటింగ్స్ ను నాసా లేజర్ టెక్నాలజీ సాయంతో బయటపెట్టింది. గోడలపై ఏనుగులు అలాగే దేవుడి బొమ్మలు అలాగే టవర్స్ వంటి చిత్రాలను గీసారు. ఈ చిత్రాలను చూస్తే భవిష్యత్ టెక్నాలజీకి వారు ముందు అంకురార్పణ చేశారని అనిపిస్తుంది.
16. సంగీతానికి సంబంధించిన అనేక పరికరాలు ఈ చిత్రాల్లో దాగి ఉన్నాయి. అలాగే ఆ కాలంలోనే వాడిన బోట్ల టెక్నాలజీని చూసిన శాస్ర్తవేత్తలు ఆశ్చర్యపోతున్నారు.
17. వీటితో పాటు రామయణానికి సంబంధించిన పెయింటింగ్స్ గోడలపై అబ్బురపరుస్తున్నాయి. సింహాలు, కోతులు, అలాగే ఆంజనేయస్వామి వంటి చిత్రాలను నాసా తన కెమెరాలో బంధించింది.
18. మొత్తం 400 ఎకరాల్లో నిర్మించిన ఈ దేవాలయం లో దాదాపు 200 పెయింటింగ్ చిత్రాలను ఆస్ట్రేలియన్ అర్కియాలజిస్ట్ సేకరించారు. చీకటి ప్రపంచంలో దాగిన ఈ కళాఖండాలను వెలుగు ప్రపంచంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇక్కడ ఉన్న పెయింటింగ్ చిత్రాల్లో గుర్రపు స్వారీ చేస్తున్న చిత్రాలు. ఆ కాలంలోనే గుర్రపు స్వారీల్లో ఆరితేరిపోయినట్లుగా కనపడుతున్నాయి. అంతే కాకుండా భవిష్యత్ లో ఈ నాగరికత గురించి తెలుసుకునేందుకు వారు ముందుగానే అక్కడ ఈ పెయింటిగ్ చిత్రాలు వేశారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
19. సువిశాలమైన నీటి కొలను మధ్య భూమిని చదును చేసి, ఇసుక రాళ్లను, ఇసుకను పొరలు పొరలుగా పేర్చి, హిమాలయాల్లోని కైలాసం సహా ఐదు దివ్య శిఖరాలకు ప్రతీకగా ఐదు శిఖరాలతో ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రసిద్ధి.
20. ఈ ఆలయంలో 1352 స్తంభాలు ఉన్నాయి. పైకప్పు రాళ్లను ‘కోబ్లింగ్' పద్ధతిలో అతికారు. తేలికైన లాటరైట్ రాళ్లు కదిలి, శిలలను ముందుకు తోసివేయకుండా మెట్లు కట్టారు. ఉషోదయ వేళ గోపురం వెనుక నుండి ఉదయ భానుడు మెల్లిగా నులి వెచ్చని లేలేత కిరణాల్ని ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే ఎంతసేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది.
21. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా హిందూ రాజుల పాలనలో ఉంది. అసలు విషయానికొస్తే పూర్వకాలంలో ‘కాంబోజ దేశం' అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంబోజదేశాన్ని కంబోడియాగా మార్చేశారు. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి.
22. వేద భూమిగా మన్ననలు పొందిన ఈ దేవాలయం ఆ తర్వాతి కాలంలో తన ఉనికి కోల్పోయి అడవులలో కప్పబడిపోయింది. కొన్ని ఏళ్ల తరువాత కంబోడియా ఫ్రెంచి ప్రభుత్వ అధీనంలోకి వచ్చాక ఆ ఆలయం తిరిగి వెలుగు చూసింది.
23.భువిలో వైకుంఠాన్ని తలపించే ఈ ఆలయాన్ని ప్రతి ఒక్కరూ జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే. హిందూ సాంప్రదాయన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ ఆలయం విశిష్టతను తెలుసుకోవాల్సిందే.

➢ సేకరణ:- కార్తికేయ'S ఓపెన్ బుక్.🙏🙏

11/12/2022

పేదపిల్లల సేవలోనే ఈమెకు ఆనందం...
సంపన్న కుటుంబంలో పుట్టింది. కెరీర్‌లో విజయాలు సాధించింది. ఆపైన నిరుపేద పిల్లల కోసమే ఈమె తపన.

""హర్‌సంజమ్‌ కౌర్‌"" కోల్‌కతాలో సంపన్న వ్యాపార కుటుంబంలో పుట్టింది. తెలిసిన వాళ్లంతా హ్యారీ అని పిలుస్తారు. ఇంగ్లండ్‌లో ఎంబీఏ చేసింది. కెరియర్‌లో ఎందుకో కుదురుకోలేదు. ఈలోపు పెళ్లయింది. భర్త ఉద్యోగరీత్యా చాలా ఏళ్లు ఎన్నో ఊళ్లలో గడిపారు. ఊరు మారిన ప్రతిసారీ ఇంటిని చక్కబెట్టుకోవడం ఆమెకి సరదాగా ఉండేది. ఇంటీరియర్‌ డిజైన్‌ నేర్చుకుంటే ఇంకెంత బాగుండో అనుకుని, ఆ కోర్సు చేసింది. తర్వాత అదే వృత్తి అయింది. అందులో విజయవంతమైంది. కానీ భర్త సంపాదన, తన కెరియర్‌తో పెద్దగా ఆనందం కలిగేది కాదు. తనకి మొదటినుంచీ ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అవసరంలో ఉన్న వాళ్లని ఆదుకున్న రోజున పట్టలేని సంతోషాన్ని అనుభవించేది.

**మలుపు తిరిగిన జీవితం**
‘అమ్మూకేర్‌’ అనే సంస్థ ట్రెక్కింగ్‌, మెడిటేషన్‌ల కోసం మౌంట్‌ కైలాష్‌ యాత్ర నిర్వహించింది. కొంచెం మార్పు ఉంటుందని తనూ వెళ్లింది. దేశ విదేశాల నుంచి ఎందరో దానికి వచ్చారు. వాళ్లలో ఒక్కరికీ డబ్బు, హోదాల తాపత్రయం లేదు. అందరిలో సేవాతత్పరతే. ఆ యాత్ర ఆమె జీవన విధానాన్ని మార్చేసింది. తానూ సేవ చేయాలనుకుంది.

**కుటుంబానికే రక్ష**

2018లో ‘ఆంగన్‌’ ఆరంభించింది. తనని ప్రేరేపించిన ‘అమ్మూకేర్‌’ స్థాపకుని పేరుతో తన సంస్థకి ‘మోహన్‌జీ కా ఆంగన్‌’ అని పేరుపెట్టింది. భార్యల్ని హింసించే మగవారి వల్ల పిల్లలకీ నరకయాతనే. వాళ్లని ఆదరించాలనేది ఆమె తపన. కూలీలు తమ పిల్లల్ని ఆంగన్‌లో వదిలి పనికి వెళ్తారు. వాళ్లకి చదువుతోబాటు ఆహారం, ఆరోగ్య సంరక్షణ కల్పిస్తుంది హ్యారీ. పేద కుటుంబాలకు నిత్యావసర సామగ్రితో మంత్లీ కిట్‌ ఇస్తుంది. పిల్లల్ని ఉత్సాహంగా ఉంచేందుకు ఆటపాటలూ, డ్రాయింగ్‌ పోటీలు నిర్వహిస్తుంది. ‘ఆంగన్‌’ విజయవంతంగా నడుస్తుండగా కరోనా విపత్తు వచ్చింది. దానివల్ల ముఖ్యంగా వలస కూలీల జీవితాలు చితికి పోయాయి. ఆటపాటలతో ఆనందంగా గడపాల్సిన చిన్నారులు బిక్కు బిక్కుమంటూ భయం గుప్పెట్లో ఉండటం హారీని కదిలించింది. లాక్‌డౌన్‌లో ఆంగన్‌ను మూసినప్పటికీ భోజన ఏర్పాటు ఆగలేదు. అధికారులు, పోలీసుల సాయంతో పదివేల మందికి భోజనాలు, మాస్కులు, శానిటైజర్లు అందించింది.

**భీతిల్లే తల్లుల కోసం...**
ఇదంతా అనుకున్నంత సులువేమీ కాదంటుందామె. సంచార జీవితానికి అలవాటు పడిన చిన్నారులు ఒకచోట కూర్చోడానికి ఇష్టపడక పారిపోవడానికి చూస్తారు. క్రమశిక్షణ ముఖ్యమని వారిని లాలనతోనే కట్టిపడేస్తుంది. తల్లిదండ్రులు కష్టనష్టాలు చెప్తుంటారు. ఆంగన్‌ వీలైనంత వరకూ వాటిని పరిష్కరిస్తుంది. ఒక ఐదేళ్ల చిన్నారిని ఆమె తండ్రి స్నేహితుడు లైంగికంగా వేధించాడు. ఇలాంటి అమానవీయ సంఘటనలతో తల్లులు భీతిల్లి ఉంటారు. తమ పిల్లల్ని భద్రంగా చూసుకుంటోన్న ఆంగన్‌ ఆ తల్లులకు భరోసానిస్తోంది. అక్కడ చిన్నారులకు కళలూ, యోగా కూడా నేర్పిస్తూ చక్కటి వాతావరణాన్ని కల్పిస్తోంది. వీళ్లకోసం వసతి గృహం ఏర్పాటుచేసి పూర్తి భద్రత కల్పించాలని, చురుగ్గా ఉన్న పిల్లల్ని పై చదువులు చదివించాలని ప్రయత్నిస్తోంది హ్యారీ.

➢ సేకరణ:- కార్తికేయ'S ఓపెన్ బుక్.🙏🙏

06/12/2022

డా..బాబాసాహెబ్ అంబేద్కర్ 66 వ వర్ధంతి...

ప్రపంచ మేధావిగా డా.బి.ఆర్. అంబేద్కర్ ను ఐక్యరాజ్య సమితి గుర్తించిన నేపథ్యంలో, తన జీవితమే తన సందేశంగా అంబేడ్కర్ చూపడం, తను జీవితంలో పడ్డ కష్టాలు, తన జాతి ప్రజలు పడకూడదనే విషయాన్ని తెలియజేస్తున్నాయి.

భీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ పుట్టినప్పటినుండి అగ్ర కులాల చేతిలో ఎన్నో అవమానాలు పడ్డా, జీవితంలో ఎదురైన సవాళ్ళను అధిగమించాడు. బరోడా మహారాజు సహాయంతో, కొలంబియా, లండన్ యూనివర్సిటీలలో ఎన్నో ఉన్నత చదువులు చదివి యావత్ ప్రపంచంలోనే అణగారిన వర్గాలకు ఆదర్శంగా నిలిచాడు. మహారాష్ట్రలోని మహాద్ చెరువులో అంటరాని కులాలు నీళ్లు తాగరాదనే అగ్రవర్ణ ఆంక్షలకు వ్యతిరేకంగా 1927 లో మహాద్ చెరువు పోరాటానికి నాయకత్వం వహించి, ఆ వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారు. దేశంలో సామాజిక సమానత్వం లేని కారణంగా, భౌతికంగా పూడ్చలేని కులాల మధ్య అంతరాలను, భావపరంగా విప్లవం రావాలని, మనిషిని ప్రేమించే స్వభావం కలిగి, ప్రతిభను ఆహ్వానించే విశాల హృదయం కావాలని ఆకాంక్షించారు. భారతీయులందరు జ్ఞానవంతులుగా, నూతన ప్రపంచాన్ని అవిష్కరించగలిగే ప్రతిభావంతులుగా ఉండాలని,

ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగాన్ని రాశారు. ఇది కౌటిల్యుని అర్థశాస్త్రానికి, మనుస్మృతి, పరాశర స్మృతికి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఎవరి నుండి ఈ స్వేచ్ఛ, స్వాతంత్య్రం వచ్చిందో ఆయననే నిరాకరిస్తున్న దేశం మనది. అలాంటి గొప్ప రాజ్యాంగం ఇప్పటివరకు సుమారు 104 సార్లు రాజ్యాంగం సవరించబడి, 444 ఆర్టికల్స్, 12 షెడ్యూళ్లు, 26 భాగాలతో, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించి, దేశంలో సమసమాజ నిర్మాణం ఏర్పడాలని కలలు గన్న డా.బి.ఆర్ అంబేద్కర్ కలలు కలలుగానే మిగిలిపోయాయి. దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి, రాజ్యాంగంలో గల అవకాశాలను అలుసుగా చేసుకొని, వాటిని వివిధ రాజకీయ పార్టీలు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకున్నారు తప్ప, ప్రజా ప్రయోజనాల కోసం ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 76సంవత్సరాలు వచ్చినా, దేశంలో ఇంకా అసమానతలు, అవిద్య, అంటరానితనం, అక్రమాలు, అన్యాయాలు, అత్యాచారాలు, కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో ఉన్న ప్రతి భారతీయునికి కూడు, గూడు, గుడ్డ ఉండాలని, సామాజిక వెనుకబాటుకు గురి అయిన ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు విద్యలో, ఉద్యోగంలో, రాజకీయాలలో, ఆర్థిక, వ్యాపార రంగాలలో ఎదగాలని రిజర్వేషన్లు కల్పించి ఆ జాతులు ఉన్నతంగా ఎదగాలని కాంక్షించారు. కానీ, నేటి బహుజనులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది.

ఆర్టికల్ 15లో మత, జాతి, కుల లింగ భేదం లేకుండా, జన్మ స్థాన కారణాలను బట్టి వివక్ష చూపడం నేరం అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 17 ప్రకారం అస్పృశ్యత, అంటరానితనం రద్దు చేయబడింది. అయిన ఇప్పటికీ ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో వెనుకబడిన జాతులపై అనేక దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.

ఇప్పటికి గ్రామీణ భారతదేశంలో అక్షరాస్యత 60 శాతానికి మించలేదు. సగటు భారతీయుని తలసరి ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. భారతదేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతరం అయింది. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ ఏర్పాటు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు బడా పెట్టుబడిదారులకు ఆదాయ మార్గాలుగా మారిపోయాయి.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొంతమంది బి.జె.పి నాయకులు, రిజర్వేషన్లపై సమీక్ష చేయాలనుకోవడం దురదృష్టకరం. దీన్ని బహుజన నాయకులు వ్యతిరేకించడంతో కాస్త వెనక్కి తగ్గారు.

డా.బి.ఆర్ అంబేద్కర్ ఈ దేశంలో సామాజిక పరివర్తన ద్వారా ఆచరణాత్మక ప్రజాస్వామ్యం నిర్మించడం సాధ్యమని గట్టిగా విశ్వసించారు. విద్యా వ్యాప్తి, విప్లవాత్మక భూ సంస్కరణలు, ఆర్థిక సమానత్వం, సార్వత్రిక వయోజన ఓటు ద్వారా రాజకీయాధికారం తద్వారా సామాజిక మార్పు సాధ్యం అని భావించారు.

మానవ హక్కుల పరిరక్షకునిగా, మానవతా మూర్తిగా, బహుజనులు విముక్తి ప్రదాతగా, సర్వజన హితునిగా, సమస్త సమస్యల పరిష్కారానికి రాజ్యాధికారమే ముఖ్యమని తేల్చి చెప్పారు.

కానీ, కులాల మధ్య కుమ్ములాటలు, మతాల మధ్య రాజకీయ నాయకుల చిచ్చు, వెరసి బహుజనుల మధ్య అనైక్యతనే వారిని రాజకీయాధికారానికి దూరం చేస్తున్నాయి.

ఇప్పటికి అంబేద్కర్ ను అర్థం చెసుకోవాలంటే తను రాసిన రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి. అది ఇంకా భారతీయుల మనసులలోకి, మెదళ్లలోకి చేరలేదు. అది కొంతమంది చేతుల్లో ఆభరణంగానే ఉంది.దీని ప్రతిఫలాల కోసం సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమం జరగాలి, అందుకు విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు, రచయితలు భాగస్వామ్యం కావడమే బాబాసాహెబ్ కు మనమిచ్చే నిజమైన నివాళి.

(డిసెంబర్ 6 న రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా)

➢ సేకరణ:- కార్తికేయ'S ఓపెన్ బుక్.🙏🙏

Want your public figure to be the top-listed Public Figure in Mahboula?
Click here to claim your Sponsored Listing.

Telephone

Website

Address


Mahboula